ఆ కేసు తెలంగాణ ప్రభుత్వం చేతిలో నుంచి జారిపోయినట్లే!

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముగ్గురు బిజెపి ప్రతినిధులను పోలీసులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకొని జైల్లో వేయడంతో బిజెపిపై తెలంగాణ ప్రభుత్వం, బిఆర్ఎస్‌ పార్టీ రాజకీయంగా పైచేయి సాధించగలిగింది. అదే ఊపులో మునుగోడు ఉపఎన్నికలలో విజయం సాధించింది కూడా. కానీ ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 

ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగర సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తోందని, కనుక నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుండా ఏదో విదంగా తమను ఈ కేసులో ఇరికించడానికే ప్రయత్నిస్తోందని, కనుక ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని కోరుతూ అరెస్ట్ అయిన ముగ్గురు బిజెపి ప్రతినిధులు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వారి వాదనలతో ఏకీభవిస్తూ ఈ కేసుని సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఈ కేసుకి సంబందించి సిట్ సేకరించిన అన్ని సాక్ష్యాధారాలని సీబీఐ అధికారులకి అప్పగించాలని ఆదేశించింది. తద్వారా సిట్ దర్యాప్తుకి ముగింపు పలికినట్లే. 

ఒక్కసారి ఈ కేసు దర్యాప్తు సిట్ చేతిలో నుంచి  సీబీఐకి వెళ్లిపోతే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిన్నట్లే అని వేరే చెప్పక్కరలేదు. కనుక హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధిస్తే, ఈ కేసులో ముగ్గురు నిందితులూ ఈ కేసు నుంచి సులువుగా బెయిల్‌తో బయటపడతారు. ఆ తర్వాత సీబీఐ ఈ కేసును మెల్లగా అటకెక్కించడమో లేదా ఇదే కేసుతో ఆ నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగించడమో చేసీనా ఆశ్చర్యం లేదు.