
తాండూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ మరోసారి నోటీస్ జారీ చేసింది. ఈ నెల 27న విచారణకి హాజరుకావాలని దానిలో సూచించింది. మొదట బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు ఆయనని రెండుసార్లు ప్రశ్నించగా ఈసారి వేరే కేసులో ప్రశ్నించబోతునట్లు సమాచారం.
ఆయనతో పాటు సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ యజమానికి కూడా ఈడీ నోటీస్ జారీ చేసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్, అభిషేక్ అనే వ్యక్తికి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి మద్య రూ.7.70 కోట్ల ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వాటి గురించి ప్రశ్నించేందుకే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ మరోసారి నోటీస్ పంపించి పిలిపిస్తోంది.
మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరుని ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడంతో త్వరలో ఆమెకీ నోటీస్ రాబోతోంది. ఆమె ఇప్పటికే న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి మల్లారెడ్డి, కుటుంబ సభ్యుల ఇళ్ళు, కాలేజీలపై ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది కనుక త్వరలోనే ఆయన కూడా కేసులు ఎదుర్కోవలసిరావచ్చు.