
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన ఓ ఛార్జ్ షీట్‌లో సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కీలకపాత్ర పోషించారని పేర్కొంది. ఆ కేసును విచారణకి స్వీకరించిన న్యాయస్థానం ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న నిందితులందరికీ నోటీసులు పంపించింది. కనుక ఆమె న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఈరోజు ప్రగతి భవన్‌లో తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యి ఈ కేసు గురించి చర్చించనున్నారు.
ఈ కేసులో ఆమె పేరును ఛార్జ్ షీట్‌లో చేర్చడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, “ఛార్జ్ షీట్‌లో లిక్కర్ క్వీన్ పేరుని 28 సార్లు పేర్కొంది,” అంటూ పత్రికలలో వచ్చిన ఆ వార్త క్లిప్పింగ్‌ని జత చేసి ట్వీట్ చేశారు.
దానిపై ఆమె వెంటనే స్పందిస్తూ, “రాజగోపాల్ అన్న... తొందరపడకు, మాట జారకు!! 28సార్లు నా పేరు చెప్పించినా, 28,000 సార్లు నాపేరు చెప్పించినా అబద్దం నిజం కాదు...” అంటూ #ట్రూత్ ప్రివైల్స్ అని జవాబిచ్చారు.