మైనంపల్లి ఇంట్లో బిఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలు భేటీ!

ఇంతకాలం భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌)లో అసంతృప్తి సెగలు పెద్దగా కనబడలేదు. తొలిసారిగా ఐదుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో నేడు సుమారు 3 గంటలకు పైగా వారు సమావేశమయ్యారు భేటీ అయ్యారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

తామందరం మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగానే సమావేశమైన్నట్లు మైనంపల్లి హనుమంతరావు స్పష్టంగా చెప్పారు. మంత్రి మల్లారెడ్డి తన అనుచరులకే అన్ని పదవులు ఇప్పించుకొంటున్నారని, తమ నియోజకవర్గాలలో జరిగే  అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు తమకి కనీసం సమాచారం ఇవ్వడం లేదని మైనంపల్లి ఆరోపించారు. సొంత పార్టీ మంత్రే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేలను అవమానిస్తుంటే ఇక ప్రజాలెలా గౌరవిస్తారని ప్రశ్నించారు. 

మంత్రి మల్లారెడ్డి రాత్రికి రాత్రి జీవోలు తెచ్చుకొని తన వాళ్ళకి పదవులు కట్టబెట్టుకొంటున్నారని ఆరోపించారు. మా నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనం చాలా ఎక్కువైపోయిందని మిగిలిన ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి తీరు, ఆయనతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించామని, త్వరలోనే మంత్రి కేటీఆర్‌ని, సిఎం కేసీఆర్‌ని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళతామని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్పారు.