రైతులకు శుభవార్త! డిసెంబర్‌ 28నుంచి రైతు బంధు

రాష్ట్రంలో రైతులకు ఓ శుభవార్త! ఈ నెల 28వ తేదీ నుంచి వారి ఖాతాలలో రైతు బంధు నిధులు జమా అవుతాయి. దీని కోసం రూ.7,800 కోట్లు విడుదల చేయవలసిందిగా సిఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావుని ఆదివారం ఆదేశించారు. ఈసారి కూడా మొదట ఎకరం భూమి ఉన్న రైతులతో ప్రారంభించి సంక్రాంతి పండుగలోగా రైతులందరికీ చెల్లింపులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక్కొక్క రైతు ఖాతాలో ఎకరాకి రూ.5,000 చొప్పున ఎన్ని ఎకరాలు అంత సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుంది. పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలు వగైరాలు కొనుగోలు చేసుకొనేందుకు గాను ప్రభుత్వం ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఈ ఆర్ధికసాయం అందజేస్తోంది.

ఈ పదో విడత రైతు బంధు పధకం కింద రాష్ట్రంలో 65 లక్షలకి పైగా రైతులు లబ్ధి పొందుతారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అందజేయబోయే రూ.7,800 కోట్లతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో రైతు బంధు పధకం కోసం మొత్తం రూ.66,000 కోట్లు రైతులకి అందజేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 

ఆర్ధికమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్రానికి రావలసిన రూ.40,000 కోట్లు రాకుండా తొక్కిపెట్టి కేంద్ర ప్రభుత్వం ఎంతగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ రాష్ట్రంలో రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ రైతు బంధుకి సకాలంలో నిధులు విడుదల చేయాలని ఆదేశించారన్నారు. వ్యవసాయం, రైతుల పట్ల సిఎం కేసీఆర్‌కి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తున్న ఈ రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా తదితర పధకాలన్నిటినీ భవిష్యత్‌లో దేశమంతటా వ్యాపించాలనేదే కేసీఆర్‌ అభిమతమని, తద్వారా దేశంలో రైతులు వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనేదే సిఎం కేసీఆర్‌ ఆశయం అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.