ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో బస చేయడం ఆనవాయితీ. ఆ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 26 నుంచి 30వరకు రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.
ఆరోజు ఉదయం ఆమె ఏపీలోని శ్రీశైలంకి వెళ్ళి మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకొంటారు. అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొని మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె గౌరవార్ధం ఆరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు.
డిసెంబర్ 27 ఉదయం 10.30 గంటలకి నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో సంభాషిస్తారు. ఆరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని సందర్శించి అక్కడ ఐపిఎస్ శిక్షణ పొందుతున్న అధికారులతో మాట్లాడుతారు.
డిసెంబర్ 28న ఉదయం 10.40 గంటలకి భద్రాచలం చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఏర్పాటవుతున్న ‘ప్రసాద్’ అనే ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు వరంగల్ చేరుకొని అక్కడ రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ కూడా ఆమె ‘ప్రసాద్’ అనే ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. దాంతో పాటు సాంస్కృతిక శాఖకి సంబందించిన మరికొని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకి షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సందర్శించి అక్కడ విద్యార్థులతో సంభాషిస్తారు. ఆదేరోజు సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ చేరుకొని అక్కడ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు నెలకొల్పిన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు.
డిసెంబర్ 30న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలోని శాంతివనంలో గల శ్రీరామచంద్ర మిషన్‌ని సందర్శించి అక్కడ జరిగే వివిద కార్యక్రమాలలో పాల్గొంటారు. తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి చెందిన ఆశా, అంగన్వాడి వర్కర్లతో మాట్లాడుతారు. మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.