నేడు ఢిల్లీలో సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. అంతకు ముందు సిఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి బిఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం, నవ చండీయాగం చేశారు. ఈ కార్యక్రమాలకి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో పాటు కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు అందరూ హాజరయ్యారు. అయితే కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాలకి హాజరుకాలేదు.
తనకు అత్యవసరమైన రెండు సమావేశాలు ఉన్నందునే ఈ కార్యక్రమాలకి హాజరుకాలేకపోతున్నానని కేటీఆర్ తెలిపారు. అంతకు ముందు హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినప్పుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ హాజరుకాలేదు. కేసీఆర్ తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కల్వకుంట్ల కవిత అసంతృప్తిగా ఉన్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె హాజరుకాగా కేటీఆర్ డుమ్మా కొట్టారు. అయితే కేటీఆర్ చెప్పిన చాలా సహేతుకమైన కారణమే చెప్పారు కనుక ఆయనని తప్పు పట్టలేము.
టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్గా మారి దానికి కేసీఆర్ జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు కనుక తెలంగాణలో బిఆర్ఎస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? అనే ప్రశ్నకి కల్వకుంట్ల కవిత స్పందిస్తూ అది సస్పెన్స్ అని జవాబిచ్చారు.
సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ని నియమిస్తారనేది అందరికీ తెలుసు. కనుక రాష్ట్రంలో బిఆర్ఎస్ పగ్గాలు కూడా కేటీఆర్కే అప్పగించే అవకాశం ఉందని భావించవచ్చు. ఒకవేళ ఈ విషయంలో పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఏవైనా ఉంటే తప్ప ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు.