ప్రజాస్వామ్యమన్నారు... ఇదేనా? రేవంత్‌ రెడ్డి

ఓ పక్క ఢిల్లీలో సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీని ఆవిష్కరిస్తుంటే హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం సైబర్ క్రైమ్ పోలీసులు మాధాపూర్, ఇనార్బిట్ మాల్ వద్ద గల తెలంగాణ సైబర్ కార్యాలయంపై దాడి చేసి, అక్కడ ఉన్న కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్ కనుగోలుని అరెస్ట్ చేశారు. వారు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వం‌ ప్రతిష్టని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు రావడంతో సునీల్ కనుగోలుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 

దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ భగ్గుమంది. సైబర్ క్రైమ్ పోలీసులు దొంగల్లా తమ కార్యాలయంలో జొరబడి ఎంతోకాలంగా ఎంతో కష్టపడి తాము సేకరించిన విలువైన సమాచారాన్ని ఎత్తుకుపోయారని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తుండటంతో ఆయన సూచన మేరకే సైబర్ క్రైమ్ పోలీసులు తమ డేటాని ఎత్తుకుపోయారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఈవిదంగా ఖూనీ చేస్తూ కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానని ఢిల్లీకి వెళ్ళారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి పిలుపునిచ్చారు. 

రేవంత్‌ రెడ్డితో సహా పార్టీలో సీనియర్ల అధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరగా పోలీసులు మద్యలోనే వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాలు చేస్తూ సిఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలని దగ్ధం చేశాయి. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు బిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం గేటుకి కాంగ్రెస్‌ జెండా కట్టి నిరసన తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ నేతలని అరెస్ట్ చేయడమో లేదా గృహ నిర్బందం చేయడమో చేస్తున్నారు.