మరో పెద్ద లక్ష్యంతో కేసీఆర్‌.. ఢిల్లీలో బిఆర్ఎస్‌ జెండా!

పదేళ్ళ పాటు ఏకధాటిగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్‌, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపారు. అదే పోరాట స్పూర్తితో టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చి ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ప్రవేశించి శక్తివంతంగా మారిన బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ-అమిత్‌ షాలను ఢీకొనేందుకు ఢిల్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత గొప్ప లక్ష్యమో ఇది అంతకంటే పెద్ద లక్ష్యం.

ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం, అక్కడ నిలద్రొక్కుకోవడం, అందరినీ కలుపుకుపోవడం, బిజెపిని ఎదుర్కోవడం, దానిని ఓడించి లక్ష్యం సాధించడం, భారత్‌ దేశ పగ్గాలు చేపట్టడం అన్నీ చాలా కటినమైనవే. కానీ తాను తప్పకుండా ఈ లక్ష్యసాధన చేస్తానని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన విజయం సాధిస్తారో లేదో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికే కొంత స్పష్టత వస్తుంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల నాటికి బిఆర్ఎస్‌ని బలోపేతం చేసుకొని బిజెపిపై విజయం సాధించగలిగితే ఇక ఆయనకి తిరుగే ఉండదు. 

ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కేసీఆర్‌ తొలిఅడుగు వేస్తున్నారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులోని బిఆర్ఎస్‌ తాత్కాలిక కార్యాలయంలో ఈరోజు మధ్ 12.47 గంటలకి బిఆర్ఎస్‌ జెండా ఎగురవేసి లాంఛనంగా జాతీయస్థాయిలో పార్టీని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, యూపీ రాష్ట్రాల నుంచి కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొనబోతున్నారు. ఇంకా వివిద రాష్ట్రాల రైతుసంఘాల నేతలు, తెలంగాణకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.