టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెలరోజులు జైలు శిక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీసుని క్రమబద్దీకరించమంటూ కొంతకాలం క్రితం హైకోర్టు ఈవోని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను ఆయన పట్టించుకోకపోవడంతో ఆ ముగ్గురు ఉద్యోగులు మళ్ళీ ఏపీ హైకోర్టుని ఆశ్రయించి కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం తన ఆదేశాలను అమలుచేయనందుకు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకి నెలరోజులు జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

రాష్ట్ర హైకోర్టు ఆయనకి ఈ శిక్షవిధించింది కనుక ఆయన మళ్ళీ రివ్యూ పిటిషన్‌ వేసి హైకోర్టుకి క్షమాపణలు చెప్పుకొని జైలుశిక్షని రద్దు చేయించుకోవచ్చు లేదా హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేసి స్టే తెచ్చుకొని జైలుకి వెళ్లకుండా ఉండవచ్చు. ఈ రెంటిలో మొదటి ఆప్షనే సులువు కనుక ఆయన అదే చేస్తారేమో? టీటీడీ కూడా రాజకీయనాయకులతో నిండిపోవడంతో సహజంగానే అనేక అంశాలపై రాజకీయాలు జోరుగా సాగుతుండటం పరిపాటిగా మారింది. బహుశః ముగ్గురు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో కూడా రాజకీయ కారణాలతోనే పక్కన పెట్టి ఉండవచ్చు. కానీ దానికి ఈవిదంగా మూల్యం చెల్లించుకోవలసివస్తోంది.