వారాహికి తెలంగాణలో రిజిస్ట్రేషన్... ఏపీ వైసీపీ నేతలకి చెంపదెబ్బ

పవన్‌ కళ్యాణ్‌ తన రాజకీయ పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న ప్రచార వాహనం ‘వారాహి’కి తెలంగాణ రవాణాశాఖ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి టిఎస్13 ఈఎక్స్ 8384 నంబరుని కేటాయించింది. రవాణాశాఖ ప్రాంతీయ కమీషనర్ పాపారావు నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అదొక కార్వాన్ వాహనం. పవన్‌ కళ్యాణ్‌ అవసరానికి తగ్గట్లుగా తయారుచేశామని దానిని తయారుచేసిన సంస్థ ధృవపత్రం సమర్పించింది. ఆ వాహనానికి వేసిన రంగు ఎమరాల్డ్ గ్రీన్. మిలటరీ వాహనాలకు వేసే రంగు ఆలీవ్ గ్రీన్ కోడ్ నంబర్: 7బి 8165 కాగా, వారాహికి వేసిన రంగు కోడ్ నంబర్: 445 సీ 44. రెండు రంగులు వేర్వేరు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వహానానికి అన్ని పరీక్షలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉపయోగించుకొనేందుకు అనుమతించాము,” అని చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రధానంగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టి వచ్చే ఎన్నికలలో అక్కడ అధికారంలో ఉన్న జగన్‌ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రయత్నిన్నారు. కనుక అధికార వైఎస్సార్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మిలటరీ వాహనంలా ఉన్న ఈ వారాహి వాహనంపై, దానికి వేసిన రంగుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ రవాణాశాఖ దానికి అన్ని పరీక్షలు నిర్వహించి మోటారు వాహన చట్టం ప్రకారం సవ్యంగా ఉందని నిర్ధారించి రిజిస్ట్రేషన్ చేసి నంబర్ కేటాయించడంతో ఏపీ వైసీపీ నేతలకి చెంపదెబ్బ కొట్టినట్లయింది. అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిన ఏపీ ప్రభుత్వం ఇలా ప్రత్యర్ది పార్టీ నేతలపై కక్ష సాధింపులతో కాలక్షేపం చేస్తున్నారు. వారాహికి తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తయింది కనుక ఇప్పుడు ఏదో సాకుతో ఏపీలో దానిని తిరగనీయకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తారేమో? వారాహికి కొండగట్టు అంజన్న ఆలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించినట్లు సమాచారం.