కొండగట్టు ఆలయాభివృద్ధికి 100 కోట్లు: కేసీఆర్‌

ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సిఎం కేసీఆర్‌ మోతెలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ, “ఆనాడు కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పుష్కరాలు నిర్వహించి సతీసమేతంగా మొక్కు తీర్చుకొంటానని చెప్పాను. స్వామి దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పుష్కరాలు నిర్వహించి సతీసమేతంగా వచ్చి మొక్కు తీర్చుకొన్నాను కూడా. ఈ జిల్లాలో పలు ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నిత్యం వేలాదిమంది భక్తులు దర్శనాలకి వస్తుంటారు. ఒకప్పుడు కొండగట్టు అంజన్న దేవస్థానం 20 ఎకరాలలో ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆలయానికి 384 ఎకరాలు ఇచ్చాము. సుప్రసిద్దమైన, మహిమాన్వితమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసి ఉంది. ఈ ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నాను. దాంతో ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే సుప్రసిద్దమైన పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతాను. నేనే స్వయంగా వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణ పనులు చేయిస్తాను,” అని ప్రకటించారు.