
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాగ్మూలం తీసుకొనేందుకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యింది. వాస్తవానికి మంగళవారం బంజారాహిల్స్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంలో విచారణకి అంగీకరిస్తూ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ వ్రాసినప్పటికీ 11-14 వ తేదీలకు వాయిదా వేయాలని కోరుతూ మరో లేఖ వ్రాశారు. దానిపై వెంటనే స్పందించిన సీబీఐ అధికారులు ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఆమె నివాసంలో వాగ్మూలం నమోదు చేస్తామని బదులిచ్చారు. అందుకు కల్వకుంట్ల కవిత కూడా అంగీకరిస్తూ ఆరోజు ఉదయం వారికి అందుబాటులో ఉంటానని బదులిచ్చారు. కనుక కల్వకుంట్ల కవిత మళ్ళీ మనసు మార్చుకోకపోతే ఆరోజుకి సీబీఐ అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లే.
ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోరాని గత వారం సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని సీబీఐ కోర్టులో హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. దానిలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారని, ఈ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఈ కేసులో తన ప్రమేయన్ని నిరూపించే ఎటువంటి సాక్ష్యాధారాలు లభించకుండా చేసేంధుకు ఆమె 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని పేర్కొంది. సీబీఐ ఆరోపణలని కల్వకుంట్ల కవిత వెంటనే ఖండించారు కానీ మొన్న శనివారం సీబీఐ ఆమెకు తొలిసారిగా నోటీస్ పంపించింది. ఆమెను విచారించినప్పుడు సీబీఐ ఎటువంటి వివరాలను రాబడుతుందో... ఈ కేసు దర్యాప్తుని ఎప్పుడు అటకెక్కిస్తుందో చూడాలి.