
ఈ నెల 10వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సిఎం కేసీఆర్ అధ్యక్షుడు ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి చేస్తున్న కుట్రలు, మంత్రులు, టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటి, ఈడీ దాడులు, కల్వకుంట్ల కవితకి సీబీఐ నోటీసులు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కనుక ఆ సమావేశాల షెడ్యూల్, దానిలో చర్చించాల్సిన అంశాలు, చేయాల్సిన తీర్మానాలు, కేంద్ర ప్రభుత్వం దాడులను ఏవిదంగా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో ధాన్యం దిగుబడి కూడా నానాటికీ పెరుగుతోంది. కానీ ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగే భారం కాదు కనుక ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తోంది. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇక శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున టిఆర్ఎస్ పార్టీకి ‘ట్రంప్ కార్డ్’ వంటి దళిత బంధు పంపిణీ, డల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాల గురించి కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.