స్టేషన్ ఘన్‌పూర్‌లో నేనే కింగ్! ఆయన కాదు: రాజయ్య

వరంగల్‌ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మద్య కీచులాటలకు సిఎం కేసీఆర్‌ కూడా బ్రేక్ వేయలేకపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ ఇస్తానని ఇటీవల కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో రాజయ్య జోరు మరింత పెరిగింది. దళితబంధు ఓ అద్భుతమైన పధకమని కానీ రాజయ్య దానిని తన బందుమిత్రులకి, డబ్బునవారికే పంచిపెడుతూ పధకాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. రాజయ్య తీరు గురించి తాను సిఎం కేసీఆర్‌కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. 

కడియం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందిస్తూ, “ఆయన పార్టీలో సీనియర్ నాయకులలో ఒకరు. కనుక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం మానుకొంటే ఆయనకే మంచిది. నియోజకవర్గాలలో దళితబంధు పధకం ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ జరుగుతుంది తప్ప మరొకరి ద్వారా కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా కలుగజేసుకోరు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేల కోటాలో పంపిణీ అవుతుంది. కనుక ఎద్దుకి గడ్డి పెట్టి ఆవును పాలీయమంటే ఈయన్నట్లే దళితబంధులో నన్ను కాదని ఆయన (కడియం శ్రీహరి) చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోకుండా హుందాగా ఉంటే ఆయనకే మంచిది,” అని ఘాటుగా బదులిచ్చారు.