సికింద్రాబాద్‌-విజయవాడ మద్య వందే భారత్‌... ఖరారు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వందే భారత్‌ రైళ్ళలో ఒకటి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట విశాఖపట్నం-విజయవాడ మద్య ఈ రైలుని ప్రారంభిద్దామని అనుకొన్నప్పటికీ, అత్యంత డిమాండ్ ఉన్న సికింద్రాబాద్‌-విజయవాడ మద్య నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా దీనిని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ దీనిని ప్రారంభించబోతున్నట్లు తాజా సమాచారం. దీంతో బాటు నల్గొండ జిల్లా, బీబీనగర్‌లో ఎయిమ్స్ హాస్పిటల్‌ని కూడా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. 

అత్యాధునిక సదుపాయాలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్న ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు గరిష్టంగా గంటకి 160 కిమీ వేగంతో ప్రయాణించగలవు. ఈ రైళ్ళలో బెర్తులు ఉండవు సౌకర్యవంతమైన సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.  

ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్‌ వస్తున్నట్లయితే, మళ్ళీ టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మాటల యుద్ధం ప్రారంభం కావచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని విచారించేందుకు సీబీఐ నోటీస్ ఇచ్చిన నేపధ్యంలో ఈసారి కూడా తెలంగాణలో ప్రధాని పర్యటన కాస్త ఉద్రిక్తతల మద్యనే సాగవచ్చు.