
మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ మరికొందరు కలిసి నేపాల్ రాజధాని ఖాట్మండులో రెండు రోజులపాటు క్యాసినో నిర్వహించగా దానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు లేదా వారి బంధుమిత్రులు హాజరయ్యారు.
దానిలో వేలకోట్లు చేతులు మారాయని ఆ సొమ్మును హవాలా మార్గంలో దేశంలో నుంచి బయటకు తరలించారని ఆరోపిస్తూ ఈడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ని, షాపూర్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను ఏడు గంటలపాటు సుదీర్గంగా విచారించారు.
ఈడీ అధికారులు కోరినట్లు తమ బ్యాంక్ ఖాతాల రికార్డులన్నీ తీసుకువెళ్లి చూపించి విచారణకు సహకరించామని వారు తెలిపారు. వారిలో వ్యాపారవేత్త బుచ్చిబాబు… ఖాట్మండులో నిర్వహించిన క్యాసినోలో తనకి 5 శాతం వాటా ఉందని తెలిపారు. క్యాసినోకి సంబందించిన ఆర్ధిక లావాదేవీలన్నీ భారత్ నుంచే నిర్వహించామని కానీ తాను ఎటువంటి ఆర్ధికనేరానికి పాల్పడలేదని ఈడీ అధికారులకు తెలిపారు.
క్యాసినో వ్యవహారం బయటపడినప్పటి నుంచి మంత్రి తలసాని చుట్టూనే తిరుగుతుండటం గమనిస్తే ఈ వ్యవహారం గురించి ప్రశ్నించడానికి ఈడీ అధికారులు ఆయనకి కూడా నోటీసులు పంపుతారేమో?అని సందేహం కలుగుతోంది.