హైదరాబాద్ పేరు వినగానే మొట్టమొదట చెప్పుకొనేది నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మకమైన ఛార్మినార్ కట్టడం గురించే. పలు సంస్థలు, మీడియా సంస్థలు కూడా దేశంలో హైదరాబాద్ నగరాన్ని సూచించేందుకు గుర్తుగా ఛార్మినార్ బొమ్మనే వాడుతుంటాయి. అంత ప్రసిద్దమైన ఛార్మినార్ కట్టడాన్ని పేల్చేయడానికి బాంబు పెట్టానని సోమవారం సాయంత్రం పోలీసులకు ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ అక్కడకు చేరుకొని ఛార్మినార్‌ని కింద నుంచి పైదాకా క్షుణ్ణంగా పరిశీలించారు. దాని పరిసర ప్రాంతాలలో కూడా క్షుణ్ణంగా సోదాలు చేశారు. కానీ ఎక్కడా బాంబు కనిపించకలేదు
బహుశః ఎవరో ఆకతాయి చేసిన పని అయ్యుండవచ్చని నిర్ధారించుకొన్నారు. కానీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ అజ్ఞాతవ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని బట్టి ఆ ప్రాంతంలో సిసి కెమెరాల రికార్డులను పరిశీలించబోతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి సిఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారు. కనుక అప్పటి నుంచి హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితులు ఎన్నడూ చేయి దాటిపోలేదు. తెలంగాణ పోలీసులు, ఇంటలిజన్స్, సైబర్ క్రైమ్ పోలీసులు కలిసి ఎటువంటి ఉగ్రదాడులు జరుగకుండా నివారించగలుగుతున్నారు.