ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపికి సుప్రీంకోర్టు షాక్

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు బిజెపికి ఊహించని షాక్ ఇచ్చింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాధ్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం ఈ కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసుకోవచ్చని, దీనిపై సింగిల్ జడ్జ్ పర్యవేక్షణ అవసరం లేదని స్పష్టం చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసేస్తున్న పోలీస్ అధికారులతో కూడిన సిట్ బృందం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందనే నమ్మకం తమకు లేదని కనుక ఆ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతూ బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేయగా, దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, కానీ హైకోర్టు సింగిల్ జడ్జ్ పర్యవేక్షణలోనే చేయాలని, నివేదికలన్నీ ఆయనకే అందించాలి తప్ప ప్రభుత్వంలో ఎవరికీ, మీడియాకి అందించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ బృందంలో ఎవరూ కూడా ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని, లీకులు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. 

ఆ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను పక్కనపెట్టి, సిట్ బృందం స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవడానికి అనుమతించింది. ఇది బిజెపికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌ బెయిల్‌ కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఏం చెపుతుందో చూడాలి.