.jpg)
మునుగోడు ఉపఎన్నికలలో ఎదురుదెబ్బ తినడమే కాకుండా పార్టీలో అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగులబోతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఆయన రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలని కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.
కానీ ఆయన ఈ వార్తలను ఖండించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను తరచూ ఢిల్లీ వెళ్ళివస్తుంటాను. ఢిల్లీలో చదువుకొంటున్న నా మనుమడి స్కూల్ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్ళాను. అదే విమానంలో బిజెపి మహిళా నేత డికె అరుణ కూడా ఉండటం యాదృచ్చికమే తప్ప మేము ఇద్దరం కలిసి ఢిల్లీ బయలుదేరలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనేక సమస్యలున్నమాట నిజం. వాటిని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను పార్టీ మారుతున్నాననే వార్తలలో నిజం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను,” అని చెప్పారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారిలో మర్రి శశిధర్ రెడ్డి కూడా ఒకరు. రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని మర్రి ఆరోపించారు. కనుక ఆయన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడటం లేదని స్పష్టం అవుతోంది. అయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెపుతున్నారు. అవునో కాదో ఎలాగూ త్వరలోనే తేలిపోతుంది కదా!