గత నెల 26వ తేదీన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడినప్పటి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పి.రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులకు తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది. నలుగురికీ ఎస్కార్ట్ వాహనాలు కూడా సమకూర్చింది. అయితే అప్పటి నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారు. వారికి ఎంత భద్రత కల్పించినప్పటికీ ఈ కేసులో వారే కీలక సాక్షులు కనుక వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తుండటంతో నలుగురినీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సిఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఉంచుకొన్నారు.
అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సిఎం కేసీఆర్ భయపెట్టి ప్రగతి భవన్లో బలవంతంగా నిర్బందించారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఆరోపిస్తున్నారు. వారు బయటకు వస్తే ఈ కుట్ర అంతా తన ప్లాన్ ప్రకారమే జరిగిందనే విషయం బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ వారిని ప్రగతి భవన్లో నిర్బందించి ఉంచారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. మరోపక్క ‘నలుగురు ఎమ్మెల్యేలు కనబడుటలేదు...’ అంటూ వారి వారి నియోజకవర్గాలలో ఫ్లెక్సీ బ్యానర్లు కూడా వెలుస్తున్నాయి.
కనుక వారు బయటకి వచ్చి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “మమ్మల్ని ఎవరూ నిర్బందించలేదు. మా ప్రాణాలకు హాని ఉందని ఇంటలిజన్స్ నివేదికలు రావడంతో దాని సూచనమేరకు ప్రగతి భవన్లో ఉంటున్నాము. ఇటీవల మాకు ఇతర రాష్ట్రాల నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తే మేము పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాము కూడా. అయితే కొందరు కావాలనే మమ్మల్ని కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్బందించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్‌కి అందుబాటులో ఉంటూ ఈ కుట్రను ఛేదించడానికి తోడ్పడుతున్నాము. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మా ఈ పోరాటం. భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రం కాపాడిందని భవిష్యత్‌లో ప్రజలందరూ చెప్పుకొనేలా మా పోరాటం సాగుతుంది. ప్రజా కోర్టులో బిజెపిని, కేంద్ర ప్రభుత్వాని దొషులుగా నిలబెట్టేవరకు మా పోరాటం ఆగదు,” అని అన్నారు.