3.jpg)
ఈరోజు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. సిఎం కేసీఆర్ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనం ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు. కానీ శాసనసభ ఎన్నికలకి కేవలం 10 నెలల సమయం మాత్రమే ఉంది కనుక పార్టీలో అందరూ ఇప్పటి నుంచే ఎన్నికలని ఎదుర్కోవడానికి సిద్దం కావాలి. ఎమ్మెల్యేల పనితీరు బాగుంది కనుక ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ ఇవ్వబోతున్నాను. కనుక ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొంటూ ప్రజలకు మరింత సన్నిహితమయ్యేందుకు గట్టిగా ప్రయత్నించాలి. మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి విస్తృతంగా ప్రజలలో ప్రచారం చేస్తూ వారికి అవగాహన కల్పించాలి. ఇప్పటి నుంచి అందరూ ప్రజల మద్యనే ఉండాలి. వచ్చే ఎన్నికలలో మనమే నెగ్గుతామని సర్వేలన్నీ చెపుతున్నాయి. కనుక మళ్ళీ మనమే అధికారంలోకి రావడం తధ్యం.
కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటిలతో బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తే ఎవరూ భయపడోద్దు. ఇంకా ఎంతకాలం వారికి భయపడుతూ బ్రతకగలము? కనుక ఎదురుతిరిగి వారినే గట్టిగా నిలదీయండి. కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. ఆ వ్యవహారంలో దొరికిపోయిన ముగ్గురు నిందితుల సంగతి పోలీసులు, న్యాయవ్యవస్థలు చూసుకొంటాయి. కేంద్రం ఎంత నీచానికి దిగజారిపోయిందంటే చివరికి నా కూతురు కవితను కూడా బిజెపిలో చేరమని తీవ్ర ఒత్తిడి చేసింది. కనుక మనం మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో మమేకం కావాలి,” అని చెప్పారు.