తెలంగాణలో నేడు ఒకేసారి 8 వైద్య కళాశాలలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో నేడు మరో గొప్ప ముందడుగు పడింది. రాష్ట్రంలో 8 జిల్లాలలో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్ విధానంలో వాటన్నిటినీ ప్రారంభించారు.

రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండంలో ఒక్కొక్కటి చొప్పున 8 వైద్య కళాశాలలను సిఎం కేసీఆర్‌ నేడు ప్రారంభించారు. ఈ 8 వైద్య కళాశాలల ద్వారా అదనంగా మరో 1,150 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 17వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు తెలంగాణలో కేవలం 850 సీట్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు 17 వైద్య కళాశాలలలో కలిపి మొత్తం 2,790 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 8 వైద్య కళాశాలలో కూడా ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అవుతున్నాయి. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ కేసీఆర్‌ మంత్రులు, అధికారులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “తెలంగాణ ఏర్పడితే జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుచేసుకోగలమని నేను పదేపదే చెపుతుండేవాడిని అదే ఇప్పుడు జరిగింది. మారుమూల జిల్లాలైన వనపర్తి,మహబూబాబాద్‌లో కూడా వైద్య కళాశాలలు ఏర్పాటవుతాయని బహుశః ఎవరూ అనుకొని ఉండరు. కానీ ఇప్పుడు ఊహించనిది కూడా సాధ్యం చేసి చూపాము. జిల్లాకొకటి చొప్పున వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవాలనుకొన్నాము కనుక త్వరలోనే మరో 17 వైద్య కళాశాలలు కూడా ఏర్పాటుచేస్తాము.

ఈ వైద్య కళాశాలల ఏర్పాటులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన కృషి, కనబరిచిన పట్టుదల ఎన్నటికీ మరువలేనివి. ఇందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే వివిద శాఖల అధికారులు, ఉద్యోగులు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

కరోనా వచ్చినప్పుడు యావత్ ప్రపంచం విలవిలలాడిపోయింది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యవ్యవస్థలు చాలా బలంగా ఉండటంతో త్వరగా ఆ సమస్య నుంచి బయటపడగలిగాము. వైద్య కళాశాలల పెంపుతో వైద్యుల సంఖ్యను క్రమంగా పెంచుకొని రాష్ట్రానికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తాము,” అని అన్నారు.