హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగున్న వాహనాల కోసం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తూనే, రద్దీ జంక్షన్ల వద్ద కు పాదచారులు రోడ్డు దాటెందుకు ఫుట్-ఓవర్-బ్రిడ్జీలను కూడా నిర్మిస్తోంది. రూ.100 కోట్ల వ్యయంతో నగరంలో మొత్తం 38 ఫుట్-ఓవర్-బ్రిడ్జీలను నిర్మిస్తోంది. ఉప్పల్ జంక్షన్ వద్ద
వాటిలో ఇప్పటికే ఏడు పూర్తయ్యి ప్రజలు వినియోగించుకొంటున్నారు. రూ.5 కోట్లు వ్యయంతో ఎర్రగడ్డ వద్ద నిర్మించిన ఫుట్-ఓవర్-బ్రిడ్జీ నిర్మాణ పనులు పూర్తవడంతో నేడు దానిని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డెప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొంటారు. ఈ రోడ్డులో అనేక భారీ వాహనాలు సైతం ప్రయాణిస్తుంటాయి కనుక దీనిని రోడ్డు నుంచి 5.80 మీటర్ల ఎత్తులో ఉండేలా నిర్మించారు. దీని వాక్ వే పొడవు 34.30 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు. రోడ్డు దాటడం కోసం అన్ని మెట్లు ఎక్కడానికి చాలామంది ఇష్టపడరు కనుక ఈ ఫుట్-ఓవర్-బ్రిడ్జికి రెండు వైపులా ఎస్కలేటర్స్ ఏర్పాటు చేశారు.
ఉప్పల్ చౌరస్తాలో రూ.25 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న స్కై వాక్ కూడా నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తవుతున్నాయి. దీని పొడవు 640 మీటర్లు, 3 మీటర్ల వెడల్పు. దీనికి మొత్తం 6 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉంటాయి. వాటిలో నాగోల్ రోడ్, రామంతపూర్ రోడ్, జీహెచ్‌ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద గల వరంగల్ బస్టాప్, ఉప్పల్ ఎలక్ట్రికల్ ఆఫీసు సమీపంలో గల పోలీస్ స్టేషన్ వద్ద ఒక్కోటి చొప్పున ఈ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటుచేస్తున్నారు.
ఈ స్కై వాక్ నలువైపులా 8 భారీ లిఫ్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటు 12 మెట్ల మార్గాలు కూడా ఉంటాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్‌తో అనుసంధానించబడిన ఈ స్కై వాక్ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో అందుబాటులోకి వస్తుంది.