రాజీవ్ గాంధీ హంతకులందరికీ సుప్రీంకోర్టు విముక్తి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులందరికీ సుప్రీంకోర్టు విముక్తి కల్పిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నేరస్థురాలు నళినితో సహా ఆరుగురు ఖైదీలు దాదాపు మూడు దశాబ్ధాలుగా జైలు శిక్ష అనుభవించినందున ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకి గల విశేషాధికారాలతో రాజీవ్ హంతకులందరికీ విముక్తి ప్రసాదిస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు చెప్పింది. 

1991, మే 21వ తేదీన తమిళనాడులో శ్రీపెరంబుదూరులో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నప్పుడు ధను అనే ఎల్టీటీఈ మహిళా ఉగ్రవాది ఆత్మహుతి దాడి చేసుకొంది. ఆ ప్రేలుడులో రాహుల్ గాంధీతో పాటు మొత్తం 14 మంది చనిపోయారు. రాజీవ్ హత్యకు కుట్ర పన్నిన ఏజి. పెరరివాళన్, నళిని, రవిచంద్రన్, రాబర్ట్ పాయాస్, జయకుమార్, మురుగన్, శాంతన్‌లను దోషులుగా నిర్దారించి 1998 ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. కానీ సుప్రీంకోర్టు వారి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 

మరణశిక్ష నుంచి తప్పించుకొనేందుకు వారి తరపున న్యాయవాదులు చేసిన అలుపెరుగని పోరాటమే వారి ప్రాణాలు నిలపడమే కాకుండా నేడు వారికి జైలు జీవితం నుంచి విముక్తి కూడా ప్రసాదించిందని చెప్పవచ్చు. తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ శ్రీలంకలోని తమిళులకు, వారి కోసం పోరాడిన ఎల్టీటీఈకి సంఘీభావం తెలుపుతుంటాయి. కనుక తమిళనాడులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జైలులో ఉన్న రాజీవ్ హంతకులను విడిపించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉండేవి. అందరి ప్రయత్నాలు ఫలించి చివరికి రాజీవ్ హంతకులందరూ జైలు నుంచి విడుదలకాబోతున్నారు. భారతీయులు ఇందుకు సంతోషిచాలా లేక బాధపడాలా?