
ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకోని రాత్రి నగరంలోనే బస చేసి రేపు ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి సిఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ గవర్నర్, డిజిపి, వైసీపీ మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆయనకు స్వాగతం చెపుతూ విశాఖనగరంలో ఫ్లెక్సీ బ్యానర్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. రేపు యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరుగబోయే బహిరంగసభకు ఏర్పాట్లన్నీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా చేయిస్తున్నారు. ప్రధాని సభకు కనీసం లక్షమందిని జనసమీకరణ చేసే బాధ్యతను కూడా జగన్ ప్రభుత్వమే భుజానికెత్తుకుంది. జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ హడావుడితో ఏపీ బిజెపి నేతలను పట్టించుకొనేవారేలేరు.
జగన్ ప్రభుత్వం విశాఖను రాజధాని చేయాలనుకొంటున్నందున విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ వస్తుండటంతో తమ వాదనకు బలం చేకూరుతుందనే ఉద్దేశ్యంతోనే జగన్ ప్రభుత్వం ఇంతహడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు. అయితే నేటికీ విభజన హామీలు చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని మోడీ ప్రభుత్వం అమ్మేస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఇంత ఘనంగా స్వాగతం పలుకుతుండటం విశేషం.
ఏపీలో ఘనంగా స్వాగత సత్కారాలు అందుకొని రేపు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీకి తెలంగాణలో పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకు అడుగడుగునా నిరసనలు ఎదురవబోతున్నాయి. ఇప్పటికే వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు, చేనేత, సింగరేణి కార్మికులు మోడీకి నిరసనలు తెలిపేందుకు సిద్దం అవుతున్నారు. హైదరాబాద్‌తో సహా కొన్ని చోట్ల ‘మోడీ గో బ్యాక్’ అంటూ ఫ్లెక్సీ బ్యానర్లు కూడా వెలిశాయి. ఈసారి కూడా సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి మొహం చాటేయనున్నారు. బహుశః మంత్రి తలసాని యాదవ్‌ని పంపించవచ్చు. కనుక ప్రధాని నరేంద్రమోడీకి ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిభిన్నమైన అనుభవాలు ఎదుర్కోబోతున్నారు.