ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అరెస్ట్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఈరోజు న్యూఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు, అరబిందో గ్రూప్ డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు  మద్యం వ్యాపారి బినయ్ బాబుని కూడా ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 

అరబిందో గ్రూపులోని 12 కంపెనీలలో, ట్రైడెంట్ లైఫ్ సైన్సస్ అనే మరో కంపెనీలో శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఆయనను ఓసారి ప్రశ్నించిన ఈడీ అధికారులు, మళ్ళీ గత మూడు రోజులుగా ప్రశ్నించారు. కానీ శరత్ చంద్రారెడ్డి విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. 

ఈ కేసులో హైదరాబాద్‌కి చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ని నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ఇదివరకే అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 15మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా, వారిలో దినేష్ అరోరా అనే మద్యం వ్యాపారి అప్రూవరుగా మారి ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు అంగీకరించాడు. 

ఇక ఈ కేసులో టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపించగా ఆమె వాటిని ఖండించిన సంగతి తెలిసిందే. 

ప్రధాని నరేంద్రమోడీ రేపు సాయంత్రం విశాఖకు చేరుకొని శనివారం బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్‌ (బేగంపేట)కు చేరుకొని, హెలికాఫ్టర్‌లో రామగుండంకి చేరుకొని ఎరువుల కర్మాగారాన్ని ప్రారంబించనున్నారు. 

సరిగ్గా ఇదే సమయంలో ఈడీ అధికారులు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అరెస్ట్ చేయగా, మరోపక్క టిఆర్ఎస్‌ నేతల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తుండటం విశేషం. 

బుదవారం హైదరాబాద్‌, కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్‌ ఇళ్ళు, గ్రానైట్ కంపెనీలలో ఈడీ అధికారులు సోదాలు చేయగా, ఇవాళ్ళ హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.