ములుగు జిల్లాలో మళ్ళీ మావోయిస్టులు రెచ్చిపోయారు. వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్ అనే వ్యక్తిని బుదవారం రాత్రి మావోయిస్టులు కత్తులు, గొడ్డళ్ళతో గ్రామస్తుల కళ్లెదుటే హత్య చేశారు. వాజేడు ఏరియా కమిటీ పేరుతో వారు ఓ లేఖ అతని శవం పక్కన పెట్టి వెళ్ళిపోయారు. గోపాల్ పోలీసుల ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే అతనిని ప్రజాకోర్టులో శిక్షించామని, ఇక ముందు ఎవరైనా పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తే వారికీ ఇదే గతి పడుతుందని లేఖలో హెచ్చరించారు. తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని భూటకపు ఎన్కౌంటర్లు చేసిందని, దీనిని సహించబోమని మావోయిస్టులు ఆ లేఖలో ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం.
గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం ఐదుగురు మావోయిస్టులు బుదవారం రాత్రి గోపాల్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. అతను వారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా వారు వెంటాడి అతనిని పట్టుకొని గ్రామంలోకి తీసుకువచ్చి కత్తులు, గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మృతుడు గోపాల్‌కి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.
ఈ సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని మావోయిస్టులు వ్రాసిన ఆ లేఖను స్వాధీనం చేసుకొని గోపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మూడు వారాల క్రితమే తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులలో పర్యటించి మావోయిస్టుల కదలికలు పెరిగాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు అప్రమత్తమయ్యారో లేదో తెలీదు కానీ మావోయిస్టులు ఈవిదంగా జిల్లాలో తమ ఉనికిని చాటుకొన్నారు.