దేశానికి ఈసీ అవసరం లేదు: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపై స్పందిస్తూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుదవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరుతున్న సిఎం కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నికలలో తన సొంత కాళ్ళపై నిలబడలేక వామపక్షాలను ఆశ్రయించారు. చిరకాలంగా కాంగ్రెస్ పార్టీకి సహజ మిత్రులుగా ఉన్న వామపక్షాలు కూడా కేసీఆర్‌ మాయలో పడి ఆయనకు జై కొడుతున్నారు. అయితే వారు ఎంతో కాలం కేసీఆర్‌తో కలిసి పనిచేయగలరని నేను అనుకోవడం లేదు. 

తెలంగాణలో అద్భుతంగా పరిపాలిస్తున్నామని, ఇక దేశాన్ని ఉద్దరిస్తానని చెపుతున్న కేసీఆర్‌ మునుగోడులో వందల కోట్లు ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది? వందల కోట్లు ఖర్చు చేసి మద్యం ఎరులైపారించి కేవలం 40 రోజులలో మునుగోడు ప్రజలను కేసీఆర్‌ తాగుబోతులుగా మార్చేశారు. 

టిఆర్ఎస్‌ ఇప్పుడు పరాన్నజీవిగా మారిపోయింది. ఏదో ఓ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా మనుగడ సాగించలేకపోతోంది. టిఆర్ఎస్‌, బిజెపిలు వందల కోట్లు ఖర్చు చేసి, కాంగ్రెస్ ఓట్లను కాజేయడం వలననే మునుగోడు ఉపఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రెండు పార్టీలు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 24 వేలకుపైగా ఓట్లు రావడం మాపార్టీకి ఉన్న బలాన్ని తెలియజేస్తోంది. 

మునుగోడు ఉపఎన్నికలలోటిఆర్ఎస్‌, బిజెపిలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిసి ఉన్నా కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రేక్షకుడిలా చూస్తుండిపోయింది కనుక ఇక దేశాయికి ఎన్నికల సంఘాలు అవసరం లేదని తేలిపోయింది. రాజకీయ పార్టీలు వందల కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనుకొంటున్నప్పుడు ఇక ఎన్నికల సంఘాలు అవసరం ఏమిటి? అవి ఉన్నా లేకున్నా ఒకటే. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. టిఆర్ఎస్‌, బిజెపిలు కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్నాయి. మునుగోడులో అదే చేశాయి. నిజానికి వాటి మద్య ఉన్నది మిత్ర భేదమే తప్ప శత్రు భేదం కానే కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై మా అధిష్టానం తగిన నిర్ణయం తీసుకొంటుంది,” అని అన్నారు.