
ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఈరోజు బెయిల్పై విడుదలై ఇంటికి చేరుకొన్నారు. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంటికి చేరుకొనేటప్పుడు ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదు. మూడు నెలల వరకు సోషల్ మీడియాలో ఎటువంటి వీడియోలు పోస్ట్ చేయరాదు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదనే షరతులు విధించింది.
మూడు నెలల క్రితం రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రజలను కించపరుస్తూ మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేశారు. దాంతో బిజెపి ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, పోలీసులు ఆయన ఆగస్ట్ 25న పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడంతో కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నారు.
రాజాసింఘ్ భార్య ఉషాభాయి తన భర్తను పీడీయాక్ట్ కింద కేసు నమోదు అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టి, ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత రాజసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.