ఎన్నికలు చాలా ఖరీదైపోయాయి: పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉపఎన్నికలలో ఓటమి పాలైన కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సోమవారం నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఇడికుడ ఈ ఉపఎన్నికలలో మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్‌, బిజెపి రెండూ ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు పార్టీలు కలిపి సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేశాయని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని, సాధారణ వ్యక్తులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్న కారణంగా కొత్తగా ఎవరూ రాజకీయాలలోకి ప్రవేశించలేని పరిస్థితి కనబడుతోందని అన్నారు. 

టిఆర్ఎస్‌, బిజెపిలు మునుగోడు ఉపఎన్నికలలో వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని ఎన్నికల సంఘానికి పిర్యాదులు అందినా రెండూ అధికార పార్టీలే కావడంతో చూసి చూడనట్లు ఊరుకొందని ఆరోపించారు. టిఆర్ఎస్‌ ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసినా, మునుగోడు పోలింగ్ సమయంలో తన ఓట్లను కొల్లగొట్టేందుకు తాను సిఎం కేసీఆర్‌ని కలిసినట్లు మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి నీచ రాజకీయాలకు పాల్పడిందని పాల్వాయి స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికల సమయంలో కూడా టిఆర్ఎస్‌ ఇదేవిదంగా వ్యవహరించిందని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోవర్టు రాజకీయాలు చేయడం కూడా తన ఓటమికి ఓ కారణమని అన్నారు. ఆయన  విషయం పార్టీ అధిష్టానమే చూసుకొంటుందని అన్నారు.