తెలంగాణ విడిచిపెట్టి వెళ్ళడం కష్టంగా ఉంది: రాహుల్

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పది రోజులు భారత్‌ జోడో పాదయాత్ర నేటితో పూర్తయింది. ఈరోజు రాత్రి మహారాష్ట్రలో ప్రవేశించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి జిలా మద్నూర్ మండలంలోని మెనూర్ వద్ద కాంగ్రెస్‌ అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ, “ గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నా పాదయాత్ర నాకు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఇది వరకు అప్పుడప్పుడు సభలు, సమావేశాలకు వచ్చి వెళ్ళిపోయేవాడిని కనుక అందరినీ కలవలేకపోయేవాడిని. కానీ ఈసారి పదిరోజుల పాదయాత్రలో రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు, అందరినీ కలిసి మాట్లాడి వారి కష్ట సుఖాలు తెలుసుకొన్నాను.

ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఎంతగా కష్టపడుతున్నారో నేను కళ్ళారా చూశాను. వారు ఎంతగా కష్టపడుతున్నారో మీడియాలో కనిపించదు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజలకి, పార్టీ నేతలకి, కార్యకర్తలకి ఉన్న అచంచల నమ్మకం, ప్రేమాభిమానాలు చూసి నేను చాలా పొంగిపోయాను. ఈ పదిరోజుల పాదయాత్రలో నేను చాలా కొత్త విషయాలు తెలుసుకొన్నాను. వాటిని ఎన్నటికీ మరిచిపోను. రాష్ట్రంలో నాపాదయాత్ర ముగిసింది. కానీ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళబుద్ధి పుట్టడం లేదు. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపిన రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.