మునుగోడు ఉపఎన్నికల కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారో రేపే తేలిపోనుంది. ఓట్ల లెక్కింపుకి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద గల ఎఫ్సీఐ గోడౌన్లో రేపు ఉదయం సరిగ్గా 7 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఎప్పటిలాగే ముందుగా పోస్టల్ బ్యాలెట్ (686) ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను తెరిచి వాటిలో పోల్ అయిన ఓట్లను లెక్కిస్తారు. తొలి రౌండ్ ఫలితాలు ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది.
కౌంటింగ్ కోసం 21 టెబిల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండులో 21 పోలింగ్ కేంద్రాలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తారు. మొట్ట మొదట చౌటుప్పల్, ఆ తర్వాత వరుసగా నారాయణపురం మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాలల ఓట్లు లెక్కిస్తారు.
ముగ్గురు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, ముగ్గురు కేంద్ర ఎన్నికల కమీషన్ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో టేబిల్కు ఓ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. కౌంటీగ్ కేంద్రం చుట్టూ సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులతో కూడిన మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. ఇవి కాక సీసీ కెమెరాలతో కూడా నిఘా పెట్టారు. ఒక్కో పార్టీ నుంచి 21 మంది ఏజంట్లను అనుమతిస్తారు. వారు ఒక్కో టేబిల్ వద్ద ఒక్కరు చొప్పున 21 టెబిల్స్ వద్ద ఓట్ల లెక్కింపును పరిశీలించుకోవచ్చు.
ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించినందున మధ్యాహ్నం ఒంటి గంటలోపుగానే పూర్తి ఫలితాలు వెలువడవచ్చు. అయితే ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపిలు చాలా హోరాహోరీగా పోరాడినందున కౌంటింగులో చివరివరకు ఉత్కంఠ కొనసాగవచ్చు.