1.jpg)
ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు. ముందు రోజు, అంటే నవంబర్ 11న విశాఖపట్నంలో పర్యటించి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మర్నాడు ఉదయం బేగంపేటకు ప్రత్యేక విమానంలో చేరుకొని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో రామగుండం చేరుకొంటారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ బిజెపి అధ్వర్యంలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత మళ్ళీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
గత ఏడాదిగా సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం, బిజెపిలపై కత్తులు దూస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలు, దానికి ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో వాటి మద్య యుద్ధం పరాకాష్టకు చేరుకొంది. ఇదివరకు ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినప్పుడే జ్వరం వచ్చిందనో లేదా మరో వంకతోనో సిఎం కేసీఆర్ మొహం చాటేసేవారు. ఇప్పుడు మోడీని గద్దె దించడమే తన లక్ష్యమని కేసీఆర్ శపధం చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి స్వాగతం పలుకుతారనుకోలేము. పైగా ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు వచ్చి వెళ్ళిన ప్రతీసారి హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడం, టిఆర్ఎస్, బిజెపి నేతల మద్య మాటల యుద్ధాలు సర్వసాధారణమైపోయాయి. కనుక ఈసారి మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ ఏ సాకుతో తప్పించుకొంటారో, ఏ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టిస్తారో చూడాలి.