భారత్‌ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ ఇక లేరు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో జరిగిన తొలి ఎన్నికలలో తొలిసారిగా ఓటు వేసిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ ఈరోజు ఉదయం కన్నుమూశారు. 106 ఏళ్ళు వయసున్న ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో కన్ను మూశారు. 

హిమాచల్ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల కోసం ఈ నెల 2వ తేదీన ఆయన పోస్టల్ బ్యాలెట్ విధానంలో చివరిసారిగా ఓటు వేశారు. దీంతో కలిపి ఆయన 34 సార్లు ఓటు వేసినట్లయింది. ఆయన వయసు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఓటు వేయించుకొన్నారు.         

ఆయన మృతి పట్ల కేంద్ర ఎన్నికల కమీషన్‌ సైతం స్పందిస్తూ, “ఆయన స్వతంత్ర భారత్‌లో కేవలం ఓటరు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైన నమ్మకం ఉన్న గొప్ప వ్యక్తి. ఆయన మృతిపట్ల కేంద్ర ఎన్నికల కమీషన్‌ సంతాపం తెలుపుతోంది. ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము,” అని ట్వీట్ చేసింది. 

140 కోట్లు జనాభా కలిగిన భారత్‌లో ఎన్నికల అధికారులు ఓ పౌరుడి ఇంటికి వెళ్ళి ఓటు వేయించుకోవడం, ఆయన చనిపోయినప్పుడు కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఈవిదంగా సంతాపం వ్యక్తం చేయడం రెండూ చాలా అరుదైన గౌరవమే కదా? 

శ్యామ్ శరణ్ నేగీ హిమాచల్ ప్రదేశ్‌లో 1917, జూలై 1న జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో అప్పుడు శీతాకాలం మొదలవుతుంది కనుక 5 నెలల ముందుగా 1951, అక్టోబర్‌ 25నే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగీ, అప్పటి నుంచి ప్రతీ ఎన్నికలలో తప్పకుండా ఓటు వేస్తూనే ఉన్నారు. దేశంలో తొలిసారి జరిగిన ఆ ఎన్నికలలో ఓటు వేసిన వ్యక్తులలో ఆయన ఒక్కరే మిగిలారు. ఇప్పుడు ఆయన కూడా కన్ను మూశారు. 

ఉన్నత చదువులు, లోకజ్ఞానం, రాజకీయ చైతన్యం అన్ని ఉన్న నేటి యువతలో చాలా మంది ఓటు వేసేందుకు బద్దకిస్తుంటారు. కానీ 106 ఏళ్ళ వయసులో కూడా శ్యామ్ శరణ్ నేగీ చివరిసారిగా ఓటు వేసి ఓ భారతీయ పౌరుడిగా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకొని కన్ను మూశారు.