ఫామ్‌హౌస్ వ్యవహారాన్ని బయటపెట్టిన గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగా కాంతారావు (పినపాక), హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), రోహిత్ రెడ్డి (తాండూరు) నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది. వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను కూడా సమకూర్చింది. అలాగే వారి ఇళ్ళ వద్ద కూడా అదనపు గన్మెన్లను నియమించి భద్రతను మరింత పెంచింది. ఈ కేసు వారు నలుగురు మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది కనుక వారికి బిజెపి శ్రేణుల వలన లేదా అపరచిత వ్యక్తుల వలన ప్రాణహాని ఉందని సిఎం కేసీఆర్ భావించడంతో వారి భద్రత కట్టుదిట్టం చేశారు.
వారు ఫామ్‌హౌస్‌లో జరిగిన వ్యవహారాన్ని బయటపెట్టిన తర్వాత మూడు రోజులు ప్రగతి భవన్‌లోనే ఉంచుకొన్నారు కేసీఆర్. ఆ తర్వాత తనతో పాటు బంగారిగడ్డలో జరిగిన బహిరంగసభకు తనతో తీసుకువచ్చారు. వారిలో సంతోష్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషింకిన సంగతి తెలిసిందే. బిజెపి తరపున తమతో బేరసారాలు చేయడానికి వచ్చిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, స్వామీ సింహయాజీ, నందు కుమార్‌లను పోలీసులు వలపన్ని పట్టుకొనేందుకు ఆయనే సహకరించారు. కనుక ఇప్పుడు ఆయన ప్రాణాలకు చాలా ప్రమాదం పొంచి ఉందని భావించి సిఎం కేసీఆర్ అదనపు భద్రతను కల్పించారు.