
తెలంగాణ సిఎం కేసీఆర్ గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏవిదంగా కుట్రలు చేస్తోందో ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు:
కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చిన రామచంద్ర భారతి, సింహయాజీ, నందుకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి వచ్చారు. వారిలో ఒక్కొక్కరికీ రెండు మూడు ఆధార్, పాన్ కార్డులు ఉన్నాయి. వాటితో వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు పేర్లు, వ్యక్తులుగా ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తుంటారు. ఈ ముఠాలో బిఎల్ సంతోష్, కేరళ బిజెపికి చెందిన తుషార్ వంటివారు మొత్తం 24 మంది సభ్యులు ఉన్నారు. వారందరికీ హెడ్ కేంద్ర హోం మంత్రి షా అట!
ఇప్పటివరకు తాము 8 ప్రభుత్వాలు కూల్చివేశామని ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నామని వారే స్వయంగా చెప్పారు. కర్ణాటకలో తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏవిదంగా ప్రభుత్వాన్ని కూల్చివేశామో వారు స్వయంగా చెప్పారు.
మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన ముగ్గురూ ప్రధాని నరేంద్రమోడీ పేరును రెండుసార్లు, అమిత్ షా పేరును 20 సార్లు ప్రస్తావించి, ఇటువంటి వ్యవహారాలన్నీ వారి కనుసన్నలలోనే జరుగుతుంటాయని చెప్పారు. తమతో చేతులు కలిపితే కొరినంత డబ్బు ఇస్తామని లేకుంటే ఈడీతో దాడులు చేయిస్తామని వారు మా ఎమ్మెల్యేలకు చెప్పారు.
ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకొన్న మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్‌లలో ఉన్న సమాచారంతో పాటు, ఫామ్‌హౌస్‌లో వారు మాట్లాడిన మాటలు తాలూకు ఆడియో, వీడియో సంభాషణల రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడానికి మోడీ, అమిత్ షాలు చేస్తున్న కుట్రలకు సంబందించి ఈ సాక్ష్యాధారాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేశంలో అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధినేతలకు పంపిస్తున్నాం.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ముగ్గురు నిందితుల వీడియో సంభాషణలను మీడియాకు ప్రదర్శించి చూపించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే దేశం మళ్ళీ వంద సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ కలిసి ఉద్యమించాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.