ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి ఛైర్మన్‌గా నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐ అండ్ పీఆర్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టి విజయ్ కుమార్ రెడ్డి పేరుతో విడుదలైన జీవోలో దీని పదవి కాలం జీతభత్యాలు, హోదా తదితర అంశాలకి సంబందించిన వివరాలతో త్వరలోనే మరో జీవో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఇటీవల ప్రముఖ హాస్య నటుడు అలీకి ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానికి మీడియా అడ్వైజర్ (సలహాదారు)గా పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి టీటీడీ భక్తి చానల్ ఛైర్మన్ పదవి ఇస్తే కొన్ని వివాదాలలో చిక్కుకొని పదవి పోగొట్టుకొన్నారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి బయటకి వచ్చేశారు. కానీ పోసాని నమ్మకంగా వైసీపీని అంటిపెట్టుకొని ఉండటం, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా సినీ రంగం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం, అన్నిటికీ మించి సిఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే సినిమా ఇండస్ట్రీలో తాను కలిసి పనిచేసే నటులని కూడా చూడకుండా వారిపై ఎదురుదాడి చేస్తుండటం పోసాని అదనపు అర్హతగా మారిందని చెప్పవచ్చు. పోసాని స్వామిభక్తికి మెచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లకు ఈ పదవిని ప్రసాదించారు.
సినీ పరిశ్రమ నుంచి వైసీపీలో ఉంటూ ఇంకా పదవుల కోసం ఎదురుచూస్తున్నవారిలో మంచు మోహన్ బాబు ఉన్నారు. అయితే ఆయనకు కాస్త ఆవేశం, దూకుడు రెండూ ఎక్కువే కనుక ఆయనకు ఈ పదవుల జాబితాలో చోటు లభించలేదు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా వంటివారు వచ్చినప్పుడు మోహన్ బాబు వారిని కలుస్తుండటంతో ఆయన విశ్వసనీయతపై సిఎం జగన్మోహన్ రెడ్డికి ఇంకా అనుమానాలు ఉన్నట్లున్నాయి. మరి మంచు కరిగిపోయి వేరే పార్టీలోకి ప్రవహించేలోగా ఆయనకు కూడా ఏదైనా ఇటువంటి పదవి ఇస్తారో లేదో చూడాలి.