మునుగోడులో ఓ పక్క పోలింగ్ సాగుతుంటే, ఇంతవరకు తమకు ఎవరూ పైసలు ఇవ్వలేదంటూ కొందరు మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఓ మహిళను ఎన్టీవీ న్యూస్ రిపోర్టరు కలిసి “ఏమ్మా ఓటేశావా? ” అని అడిగితే ఆమె “ ఎందుకూ మాకు పైసలు ఈయలే... మేమెందుకు ఎయ్యాలే... ఎయ్యం... తిరిగిపోతున్నాం. ఈరోజు పొద్దున వచ్చి అడిగినా. నాదాకా లేదని నా పేరు కొట్టేశామని చెప్పారు. పొద్దున ఓ పార్టీ నేత వచ్చి మా గల్లీలో అందరికీ ఓటుకి రూ.4,000 చొప్పున పంచిపోయిండు. కానీ నాకు పైసలు ఇవ్వలేదు. నాలాగ డబ్బు ముట్టన్నోళ్ళు 10-20 మంది వచ్చిపోయారు. మళ్ళీ ఈసారి పార్టీకి ఓటేయమని అడిగితే అప్పుడు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తా,” అని ఆగ్రహంగా చెప్పారు.
ఇంతలో మరో మహిళ వచ్చి, “మా ఇంట్లో మొత్తం ఏడు ఓట్లున్నాయి. గల్లీలో అందరికీ డబ్బు పంచిపెట్టిపోయారు కానీ మాకు ఒక్క పైసా ఇవ్వలేదు. మా ఏడుగురు ఓట్లకి కలిపి ఓ క్వార్టర్ ఇచ్చిపోయిన్రు. మా ఓట్లు మరీ ఇంత సవకైపోయాయా? మేము ఏ పార్టీకి ఓట్లు వేసేదే లేదు,” అని తేల్చి చెప్పారు.
ఇదీ మునుగోడు ఉపఎన్నికలలో వాస్తవ పరిస్థితి! మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులోనే నెలరోజులుగా మకాం వేసి ఎన్నికల ప్రచారం చేసినా, చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి ప్రజలకు మంచీచెడు చెప్పివెళ్ళినా, మునుగోడు ప్రజలు మాత్రం ఎవరి మాటలను, వాదనలను పట్టించుకోలేదని, నోటుకే ఓట్లు అని ఈవిదంగా ఖరాఖండీగా చెపుతున్నారు.
ఉదయం 11 గంటలకు మునుగోడులో 25.8 శాతం పోలింగ్ నమోదైన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మాకు పైసల్ రాలే..మేం ఓటు వెయ్యం..#Munugode #MunugoduBypoll #Telangana #voters #money #votefornote #NTVTelugu pic.twitter.com/kBRNz2kGT8
— NTV Telugu (@NtvTeluguLive) November 2, 2022