
మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమీషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి మునుగోడులో పలువురు వ్యక్తులకు, సంస్థలకు చెందిన 22 బ్యాంక్ ఖాతాలకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయని, ఆ సొమ్మును మునుగోడు ఉపఎన్నికలలో ఓటర్లకు పంచిపెట్టేందుకేనని, కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందిన కేంద్ర ఎన్నికల కమీషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
మరో మూడు రోజులలో నవంబర్ 3న పోలింగ్ జరుగబోతోంది. అయితే నేటితో ఎన్నికల ప్రచారం ముగిసినందున ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన హైలైట్ చేసుకొని ఓటర్ల సానుభూతి పొందే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపిలు పోటాపోటీగా ప్రచారం చేయడమే కాకుండా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాయి. రేపు, ఎల్లుండి ఈ పంపకాలు మరింత జోరుగా సాగడం ఖాయం. కనుక ఈ రెండు రోజులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇద్దరికీ చాలా కీలకం కాబోతోంది.