మునుగోడులో హైటెన్షన్: టిఆర్ఎస్‌-బిజెపి రాళ్ళదాడులు

ఈరోజు సాయంత్రంతో మునుగోడు ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా నియోజకవర్గంలోని పలిమెల గ్రామంలో టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకొన్నారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్ళతో కర్రలతో దాడులు చేసుకొన్నారు. టిఆర్ఎస్‌ కార్యకర్తల దాడిలో హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌లో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో అక్కడ భారీగానే పోలీసులు ఉన్నప్పటికీ ఇరువర్గాలను చెదరగొట్టడానికి వారు చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఈ దాడులలో ఇరువర్గాల కార్యకర్తలతో పాటు కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. 

నేడు ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో టిఆర్ఎస్‌, బిజెపి నేతలు, కార్యకర్తలు వీలైనంత వేగంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలను మరోసారి చుట్టేస్తున్నారు. టిఆర్ఎస్‌ శ్రేణులు పలిమెల గ్రామంలో బిజెపి క్యాంప్ కార్యాలయం మీదుగా వెళుతూ వారిని రెచ్చగొట్టడంతో బిజెపి శ్రేణులు కూడా ధీటుగా బదులిచ్చాయి. దాంతో ఇరువర్గాల మద్య వాదోపవాదాలు మొదలయ్యాయి. పోలీసులు కలుగజేసుకొని వారిని శాంతింపజేసేలోగానే ఇరువర్గాలు పరస్పరం రాళ్ళు, కర్రలతో దాడులు చేసుకొన్నారు. 

మునుగోడును నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఎన్నికల కమీషన్‌ తక్షణం పోలీస్ బందోబస్తు పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఎవరూ మునుగోడులో ఉండకూడదని, ఉంటే తక్షణం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.