రేపటితో ప్రచారం సమాప్తం... పంపకాలు షురూ?

మునుగోడు ఉపఎన్నికలను టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా గెలవాలని పంతం పట్టడంతో దేశంలోకెల్ల అత్యంత ఖరీదైన ఉపఎన్నికలుగా మారాయి. మునుగోడు నియోజకవర్గం చుట్టూ 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ, డబ్బు ఆన్‌లైన్‌లో నేరుగా ఓటర్ల బ్యాంక్ ఖాతాలలోకి వచ్చిపడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీ నుంచి ఏకంగా రూ.5.42 కోట్లు ఆన్‌లైన్‌లో రాగా, ఇవాళ్ళ జూబ్లీహిల్స్‌ వద్ద మరో రూ.89.91 లక్షలు పట్టుబడింది. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యక్తిగత సహాయకుడు జనార్ధన్ వద్ద కారు డ్రైవరుగా పనిచేస్తున్న కడారి శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద నుంచి వెస్ట్ జోన్ పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకొన్నారు. 

మునుగోడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం పట్టుకొన్నామని ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ తెలిపారు. అయితే పట్టుబడని సొమ్ము ఎన్ని కోట్లు ఉందో ఎవరూ ఊహించలేరు. నవంబర్‌ 3న పోలింగ్ జరుగుతుంది కనుక మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన పంపకాలు ఒక ఎత్తైతే మిగిలిన రెండు రోజులలో పోలింగ్ జరిగేవరకు చేసే పంపకాలు మరో ఎత్తు అని అందరికీ తెలిసిన విషయమే. 

రేపు సాయంత్రం తర్వాత మునుగోడులో స్థానికులు కానివారెవరూ ఉండరాదని, ఉంటే చర్యలు తప్పవని వికాస్ రాజ్‌ హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లున్నారని, వారి కోసం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మునుగోడులో 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని అక్కడ అదనంగా భద్రతదళాలను మోహరిస్తున్నామని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల కోసం మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరంకాగా ముందు జాగ్రత్త చర్యగా మరో 300 మందిని సిద్దంగా ఉంచామని చెప్పారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఆఫీసర్స్ ఉంటారని తెలిపారు.  మొత్తం 199 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కేంద్రాలను నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటారని చెప్పారు. 

గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఇప్పటికే నియోజకవర్గంలో ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశామని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఓటర్లు స్లిప్పులు అందకపోతే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్‌ 6వ తేదీన ఓట్ల లెక్కించి ఆదేరోజున ఫలితాలు వెల్లడిస్తారు.