
మరో
మూడు రోజులలో మునుగోడు ఉపఎన్నికలు జరుగబోతుండటంతో టిఆర్ఎస్, బిజెపిలు తమ అస్త్రశస్త్రాలన్నిటినీ
బయటకు తీసి ప్రయోగిస్తున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డిపై ఎన్నికల కమీషన్‌కు బిజెపి ఫిర్యాదు
చేయించి ఆయనపై రెండు రోజులు నిషేదం విదింపజేయగా, టిఆర్ఎస్ కూడా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసి ఆయనకు నోటీస్ ఇప్పించింది. ఆయనకు చెందిన
సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి మునుగోడుఓ పలువురు వ్యక్తులకు, సంస్థలకు గత నాలుగైదు రోజుల వ్యవధిలో రూ. 5.24 కోట్లు
బదిలీ అయ్యాయని, ఆ సొమ్ము మునుగోడు ఉపఎన్నికలలో ఓటర్లకు పంచిపెట్టేందుకేనని
కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల
కమీషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
దానిపై
స్పందించిన కేంద్ర ఎన్నికల కమీషన్ వెంటనే ఆయనకి నోటీస్ జారీ చేసి సోమవారం సాయంత్రం
4 గంటలలోపు వివరణ ఇవ్వాలని లేకుంటే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకొంటామాని
హెచ్చరించింది. దీనిపై విచారణ జరిపి తక్షణం నివేదిక పంపించాలని కేంద్ర ఎన్నికల
కమీషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ని ఆదేశించింది.
టిఆర్ఎస్, బిజెపి రెండూ కూడా మునుగోడు
ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా గెలిచేందుకు పోటాపోటీగా డబ్బు ఖర్చు
చేస్తుండటంతో ఈ ఉపఎన్నికలు దేశంలో కెల్లా అత్యంత ఖరీదైనవిగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్
రెడ్డికి ఈసీ జారీ చేసిన నోటీసే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. మునుగోడులో జోరుగా
ప్రలోభాలు సాగుతున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.