ఓ ముగ్గురూ... ఆ నలుగురూ... హైకోర్టులో పంచాయతీ

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసు జారీ చేయకుండా అరెస్ట్ చేసి తీసుకురావడంతో  ఏసీబీ కోర్టు వారికి రిమాండ్ విధించడానికి నిరాకరించింది. ఏసీబీ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ వెంటనే హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ట్ సుమలత నిందితులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. 

ముగ్గురూ తాము హైదరాబాద్‌లో ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ చిరునామాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. మరో 24 గంటల వరకు నగరం విడిచి బయటకి పోరాదని ఆదేశించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడరాదని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని ఆదేశించారు. 

ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ముగ్గురు నిందితులు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారని, అటువంటి తీవ్రమైన కుట్రకు పాల్పడినవారికి సెక్షన్ 41ఏ ప్రకారం నోటీస్ ఇవ్వలేదనే కారణంతో రిమాండ్ తిరస్కరించడం సరికాదని, కనుక ముగ్గురు నిందితులకు కోర్టులో లొంగిపోవాలని ఆదేశించాలని హైకోర్టుని కోరారు. 

నిందితుల తరపు న్యాయవాది వేదుల శ్రీనివాస్ తమ వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలని కోరడంతో ఈ కేసు విచారణను నేటికీ వాయిదా వేశారు. 

ఇదే వ్యవహారంపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు, ఏసీబీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారనే నమ్మకం లేదని కనుక ఈ కేసు దర్యాప్తు బాధ్యతని సీబీఐకి అప్పగించాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసుపై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి నేడు విచారణ చేపట్టనున్నారు.