నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబందించి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బిజెపి ప్రతినిధులుగా ఆరోపింపబడుతున్న రామచంద్ర భారతి, నందకుమార్‌లతో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డింగ్‌ని అనధికారికంగా శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు అందింది.
దానిలో రోహిత్ రెడ్డి బిజెపి ప్రతినిధులతో మాట్లాడుతూ తనతో సహా మరో ముగ్గురు బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, ఆ విషయమై చర్చించేందుకు హైదరాబాద్ వస్తే బాగుంటుందని చెప్పగా, అందుకు వారిరువురూ అంగీకరించారు. మొదట వారు వేరే రాష్ట్రంలో ఈ డీల్ మాట్లాడుకొందామని సూచించగా, ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్నందున అందరి దృష్టి తమపైనే ఉంటుందని, ఈ విషయం ఏమాత్రం బయటకు పొక్కితే కేసీఆర్ తమ అంతు చూస్తారని రోహిత్ రెడ్డి చెప్పడంతో వారివురు హైదరాబాద్‌లో డీల్ మాట్లాడుకోవడానికి ఒప్పుకొన్నారు.
మనం డీల్ ఒకే చేసుకోగానే బిజెపిలో ఇటువంటి వ్యవహారాలను చూసే బిఎల్ సంతోష్ మిగిలిన వ్యవహారాలన్నీ చూసుకొంటారని వారు చెప్పారు. మీకు ఈడీ, ఐటి నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా మేము చూసుకొంటామని, మీ భద్రత, రాజకీయ భవిష్యత్ అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకొంటుందని వారు భరోసా ఇచ్చారు.
రాష్ట్ర బిజెపి నేతలు దీనిని కేసీఆర్ డ్రామాగా కొట్టిపడేస్తున్నప్పటికీ వారి ముగ్గురి సంభాషణ వింటే బిజెపి తరపున టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్దం అవుతుంది. మరి ఈ ఉచ్చులో నుచి బిజెపి ఎలా బయటపడుతుందో, కేసీఆర్‌పై ఏవిదంగా ప్రతీకారం తీర్చుకోబోతోందో, దానిని ఆయన ఏవిదంగా ఎదుర్కొంటారో రాబోయే రోజుల్లో చూడవచ్చు.
(ఈనాడు మీడియా సౌజన్యంతో ఆడియో రికార్డ్)