రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో వచ్చిన ఆ నలుగురు సినిమాకు సీక్వెల్ కాదిది. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరంభమై ఇంకా 24 గంటలు గడవక మునుపే చకచకా జరుగుతున్న పరిణామాల గురించి ఇది.
ఫస్ట్ ఎపిసోడ్:
ఈరోజు ఉదయం తాండూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై ఫిర్యాదు చేశారు. తాను బిజెపిలో చేరితే వంద కోట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చెరో రూ.50 కోట్లు చొప్పున ఇస్తామని, వాటితో పాటు కాంట్రాక్టులు, కేంద్రంలో ఉన్నత పదవులు కూడా ఇప్పిస్తామని ప్రలోభపెట్టినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ బిజెపిలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ముగ్గురినీ సంతోష్ రెడ్డికి చెందిన ఫామ్ హౌసులోనే నిర్బందించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వడ్డించేవాడు మనోడైతే లేదా రాజు తలచుకొంటే... అన్నట్లు పోలీసులు వెంటనే సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, నందకిశోర్, సింహయాజీలను వరుసగా ఏ-1, ఏ-2, ఏ-3లుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
రెండో ఎపిసోడ్: ఇదంతా కేసీఆర్ ఆడించిన డ్రామా అని దమ్ముంటే యాదాద్రి ఆలయంలో భార్యాబిడ్డలపై ప్రమాణాలు చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తాము రేపు యాదాద్రి వెళుతున్నామని దమ్ముంటే కేసీఆర్ కూడా తన సవాల్ స్వీకరించి యాదాద్రికి రావాలని సవాల్ విసిరారు.
మూడో ఎపిసోడ్: ఈ వ్యవహారంపై బిజెపి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కుట్రలో సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో కనుగొనేందుకు సిట్టింగ్ జడ్జిలతో కూడిన ప్రత్యేక కమీషన్‌ను ఏర్పాటు చేయాలని బిజెపి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో పోలీసులు, సీఐడీ, ఏసీబీ అధికారులు సిఎం కేసీఆర్ కనుసన్నలలో పనిచేస్తుంటారు కనుక ఈ వ్యవహారంపై లోతుగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు హైకోర్టు పర్యవేక్షణలో పనిచేసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేయాలని బిజెపి తన పిటిషన్‌లో కోరింది. బిజెపి తన పిటిషన్‌లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సైబారాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వోలతో పాటు కేంద్రాన్ని, సీబీఐని కూడా ప్రతివాదులుగా చేర్చింది.
నాలుగో ఎపిసోడ్: టిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపికి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ‘ఆ నలుగురులో’ తెలుగు సీరియల్‌ల్లాగా మరో వందో రెండు వందలో ఎపిసోడ్స్ ఉండొచ్చు. కనుక ఓపికగా చూడక తప్పదు.