హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌... నేడే ప్రారంభోత్సవం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తూ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా నాగోల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను బుదవారం ఉదయం రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు.  రూ.143.58 కోట్లు వ్యయంతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్‌ పొడవు 990 మీటర్లు. ఆరు లైన్లతో ఇరువైపుల నుంచి వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా దీనిని నిర్మించారు. దీంతో ఉప్పల్-ఆరాంఘర్ చౌరస్తా మద్య నిత్యం ప్రయాణించేవారు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్ లేకుండా సులువుగా రాకపోకలు సాగించవచ్చు. 

ఎస్సార్‌డీపీలో భాగంగా మొదటిదశలో భాగంగా నగరంలో ఫ్లైఓవర్లు, రోడ్ అండర్ బ్రిడ్జి, అండర్ పాస్ రోడ్లతో కలిపి మొత్తం మొత్తం 47   నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో జీహెచ్‌ఎంసీ 41 నిర్మిస్తుండగా మిగిలిన ఆరింటిని ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, హెచ్‌ఎండీ నిర్మిస్తున్నాయి. వాటిలో 15 ఫ్లైఓవర్లతో సహా ఇప్పటివరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 


శిల్పా లేఅవుట్, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లోగా ప్రారంభోత్సవానికి సిద్దం అవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ మీదుగా అవుటర్ రింగ్ రోడ్‌ని కలుపుతూ నిర్మిస్తున్న మరో ఫ్లైఓవర్‌ కూడా నవంబర్‌ చివరినాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.