టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో పీఆర్‌సీ

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఓ శుభవార్త! వారికి పీఆర్‌సీని వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో మంగళవారం జరిగిన సమావేశంలో టి‌ఎల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీఎల్ గౌడ్‌ ఈ విషయాన్ని కార్మికులకు తెలియజేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పీఆర్‌సీ అమలు చేసేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లేఖ వ్రాసిందని, అనుమతిస్తే వెంటనే అమలుచేస్తుందని తెలిపారు. లేకుంటే మునుగోడు ఉపఎన్నికల ప్రక్రియ ముగియగానే పీఆర్‌సీని అమలుచేస్తుందని జీఎల్ గౌడ్‌ తెలిపారు. 

దీపావళి బోనస్, మూడు డీఏ బకాయిలు, రిటైర్ అయిన, కాబోతున్న ఉద్యోగులందరికీ సమ్మెకాలంలో చెల్లించాల్సిన బకాయిలను, ఉద్యోగులందరికీ పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వీటి కోసం తాము టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌పై తీవ్రంగా ఒత్తిడి చేసి సాధించామని చెప్పారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు చంద్రమోహన్, శ్రీనివాసులు, బసప్ప, సత్యశీలారెడ్డి, కొండన్న, కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తమకూ పీఆర్‌సీ, దీపావళి బోనస్ వగైరాలను చెల్లించడానికి అంగీకరించినందుకు టీఎస్‌ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నికలు వారి సంతోషానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నాయి. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిస్తే వారికి వెంటనే పీఆర్‌సీ అమలు చేయడం ఖాయం కానీ ఓడిపోతే మాత్రం అమలుచేస్తుందో లేదో అనుమానమే. కనుక ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలవాలని టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులందరూ కోరుకోవలసి ఉంటుంది.