మునుగోడులో కూడా తప్పక విజయం సాధిస్తామనే నమ్మకంతోఉపఎన్నికలను తెచ్చిపెట్టిన బిజెపికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బిజెపి మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మశాలీల నాయకుడు రాపోలు ఆనంద్ భాస్కర్ నిన్న సిఎం కేసీఆర్ని కలిసి టిఆర్ఎస్లో చేరాలనుకొంటున్నట్లు తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా జీఎస్టీ విధించి, ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న ఆ రంగాన్ని కూడా దెబ్బతీస్తోందని రాపోలు ఆనంద్ భాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. సిఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత, మగ్గం కార్మికులను ఆదుకొనేందుకు చాలా కృషి చేస్తోందని అన్నారు. అలాగే చేనేత కార్మికులకు కూడా సంక్షేమ పధకాలు అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాపోలు ఆనంద్ భాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేసారు. మునుగోడులో పద్మశాలీ ఓటర్లు చాలా మంది ఉన్నారు. కనుక ఉపఎన్నికలకు ముందు ఆ వర్గానికి చెందిన రాపోలు ఆనంద్ భాస్కర్ టిఆర్ఎస్లో చేరటం ఆ పార్టీకి చాలా మేలు చేయవచ్చు.
రెండు రోజుల క్రితమే బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఇద్దరూ మళ్ళీ టిఆర్ఎస్ గూటికి చేరుకొన్న సంగతి తెలిసిందే.