టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు నిజమైన దీపావళి... బోనస్ ప్రకటన

ఎట్టకేలకు టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు వారికి రావలసిన రెండు డీఏ బకాయిలు దాంతో బాటు దీపావళి పండుగ బోనస్ కూడా అందుకోబోతున్నారు. ఈ విషయం టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్ స్వయంగా ప్రకటించారు. 

నిన్న శుక్రవారం బస్ భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “టీఎస్‌ఆర్టీసీ సమస్యల గురించి యూనియన్ లీడర్లు నన్ను కలిసినప్పుడు నేను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులతో చర్చించి సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. 

సమ్మెకాలంలో 8,053 మంది ఉద్యోగుల జీతాల బకాయిల కొరకు రూ.25 కోట్లు, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల ఎర్నడ్ లీవ్ సొమ్ము చెల్లించేందుకు మరో రూ.20 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి గాక ఉద్యోగులకు రెండు డీఏ బకాయిలతో పాటు దీపావళి బోనస్ కూడా చెల్లించబోతున్నాము. ఈ బోనస్ కోసం రూ.20 కోట్లు, రెండు డీఏ బకాయిల చెల్లింపు కోసం రూ.10 కోట్లు, అడిషనల్ మానిటరీ బెనిఫిట్స్ కొరకు మరో రూ.5 కోట్లు కలిపి మొత్తం రూ.80 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది,” అని తెలిపారు. 

ఇక సంస్థ పరిస్థితి గురించి వివరిస్తూ, “ గతంలో తీసుకొన్న అప్పులకు నెలకు రూ.21 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాము. గతంలో పోల్చితే టీఎస్‌ఆర్టీసీ ఆదాయం రోజుకి 6 కోట్లు చొప్పున పెరిగినప్పటికీ, ఇంకా రోజుకి రూ.4-5 కోట్లు నష్టం వస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. సంస్థ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకొంటూనే, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పీఆర్‌సీ ప్రకటించడం లేదని మునుగోడు ఉపఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ప్రకటిస్తామని చెప్పారు. 

టీఎస్‌ఆర్టీసీలో పాతబస్సుల స్థానంలో త్వరలోనే 1,150 కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా 360 ఎలక్ట్రిక్ బస్సులు టీఎస్‌ఆర్టీసీలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో టీఎస్‌ఆర్టీసీని కాపాడుకొంటామే తప్ప డిపోలను మూసేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.